
D Tech: Jul 8: మెటా ఇటీవల మ్యూస్ ఇమేజ్ పేరుతో కొత్త AI ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది మెటా AI, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, వాట్సాప్ చాట్లలో అందుబాటులో ఉండగా, త్వరలో ఫేస్బుక్, మెసెంజర్లలోనూ అందుబాటులోకి రానుంది. యూజర్లు టెక్స్ట్ రూపంలో వివరణ ఇస్తే, దానికి అనుగుణంగా AI కొత్త చిత్రాలను రూపొందిస్తుంది. అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫొటోలను కలపడం, ఫొటోలోని భాగాలను మార్చడం, టెక్స్ట్ జోడించడం వంటి సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి.
అయితే ఈ కొత్త ఫీచర్‌పై ప్రైవసీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పబ్లిక్‌గా ఉన్న ఇన్స్టాగ్రామ్ ఖాతాను సూచిస్తూ AIకు ఆదేశాలు ఇస్తే, ఆ ఖాతాలోని ఫొటోలను ఆధారంగా తీసుకుని ఆ వ్యక్తిని పోలిన కొత్త చిత్రాలను రూపొందించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో వినియోగదారుడి అనుమతి తీసుకోకపోవడమే కాకుండా, వారి ఫొటోలు ఉపయోగించబడినట్లు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వదు.
ఈ అంశంపై మెటా స్పందిస్తూ, AIతో రూపొందించిన ప్రతి చిత్రంలో కనిపించని ప్రత్యేక గుర్తు (వాటర్‌మార్క్) ఉంటుందని తెలిపింది. దీని ద్వారా ఆ చిత్రం కృత్రిమ మేధతో రూపొందిందని గుర్తించవచ్చని పేర్కొంది. అయితే ఇప్పటికే రూపొందించిన AI చిత్రాలను తొలగించే అవకాశం లేదని, ఫొటోలను పూర్తిగా ఉపయోగించకుండా నిరోధించే సదుపాయం కూడా ప్రస్తుతం లేదని స్పష్టం చేసింది.
మీ ఫొటోలను AI కోసం ఉపయోగించకుండా ఉండాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ప్రొఫైల్ తెరిచి, కుడి పైవైపు ఉన్న మూడు గీతల గుర్తుపై నొక్కాలి. అనంతరం పంచుకోవడం, మళ్లీ ఉపయోగించడం (Sharing and Reuse) విభాగంలోకి వెళ్లి, మెటా కృత్రిమ మేధ కోసం మీ విషయాలను ఉపయోగించేందుకు అనుమతించడం అనే ఆప్షన్లో పోస్టులు, రీల్స్‌కు సంబంధించిన అనుమతులను నిలిపివేయాలి. దీంతో ఇకపై మీరు కొత్తగా పోస్ట్ చేసే కంటెంట్‌ను AI శిక్షణ లేదా చిత్రాల తయారీకి ఉపయోగించరు.
అయితే ఈ మార్పు గతంలో రూపొందించిన AI చిత్రాలకు వర్తించదు. మీరు ఇప్పుడు అనుమతిని నిలిపివేసినా, ఇప్పటికే తయారైన చిత్రాలు అలాగే ఉంటాయి. అలాగే తర్వాత మీ ఖాతాను ప్రైవేట్‌గా మార్చినా, ఇప్పటికే ఉపయోగించిన కంటెంట్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ కొత్త ఆప్షన్ ప్రస్తుతం అందరికీ అందుబాటులో లేకపోవచ్చని, మెటా దశలవారీగా దీనిని విడుదల చేస్తోందని తెలిపింది.
