
D Spiritual: Jul 7: కోటి తలంబ్రాల మహా యజ్ఞం: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలో శ్రీరాముల వారి కల్యాణం కోసం నిర్వహించే కోటి తలంబ్రాల మహాయజ్ఞం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీరాముడు, హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు తదితర వానరసేన పాత్రల వేషధారణలో భక్తులు పాల్గొని రామనామ స్మరణతో వరి విత్తనాలను చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వాటిని అచ్యుతాపురానికి తీసుకొచ్చారు. అనంతరం వానరసేన వేషధారణలో భక్తులు పొలంలో దుక్కి దున్ని, రామనామాన్ని జపిస్తూ వరి విత్తనాలను జల్లారు. దివి నుంచి భూమిపైకి దిగివచ్చినట్లుగా శ్రీరాముడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు పాత్రల్లో పాల్గొన్న భక్తులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలో శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఈ కోటి తలంబ్రాల మహాయజ్ఞాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 16వసారి అయోధ్య, భద్రాచలం, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాలకు పంపే కోటి తలంబ్రాల కోసం వరి సాగుకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వానరసేన వేషధారణలో కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులను అలరించారు.
శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యుడు కళ్యాణం అప్పారావు తన సొంత పొలంలోని ఎకరం 60 సెంట్ల విస్తీర్ణంలో శ్రీరాముడి ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించి, రామనామంతో వరి సాగును ప్రారంభించారు. అనంతరం కోటి తలంబ్రాల కలశాలతో విత్తనాలకు ప్రత్యేక పూజలు చేసి సాగు ప్రారంభించారు. ఈ పంట నుంచి సిద్ధమయ్యే తలంబ్రాలను అయోధ్య, భద్రాచలం, ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలకు పంపించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని రామభక్తులు తెలిపారు. శ్రీరాముడి తత్వాన్ని ప్రజల్లో విస్తరింపజేయడమే తమ లక్ష్యమని, ఈ మహాయజ్ఞంలో పాల్గొనడం తమకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోందని వారు పేర్కొన్నారు.
