
DNews: July02: విదేశీ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని పరిరక్షిస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై భారతీయ అమెరికన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విదేశీయుల పిల్లలకు పౌరసత్వం నిరాకరించాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. అమెరికాలో జన్మించిన అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసాలపై ఉన్నవారి పిల్లలను అమెరికన్లుగా పరిగణించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ విషయంపై ఇండో-అమెరికన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పు అమెరికాలోని వలస కుటుంబాలకు గొప్ప భరోసాను ఇచ్చిందని ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చింతన్ పటేల్ అన్నారు. ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల వల్ల భారతీయ, దక్షిణాసియా వలస కుటుంబాలు నేరుగా ప్రభావితమవుతాయని ఆయన అన్నారు. యూఎస్ సుప్రీంకోర్టు తీర్పును భారతీయ అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ బుటోరియా ‘చారిత్రాత్మక విజయం’గా అభివర్ణించారు. దాదాపు 52 లక్షల మంది ఇండో-అమెరికన్లలో, 12 లక్షలకు పైగా ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోసం చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని ఎఫ్‌ఐఐడీఎస్ అధ్యక్షుడు ఖండేరావు కండ్ తెలిపారు. తాజా అంచనాల ప్రకారం, ప్రస్తుతం అమెరికాలో 6 నుంచి 7 లక్షల మంది హెచ్1బీ వీసా హోల్డర్లు ఉన్నారు. వారిలో 70 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు హెచ్1బి వీసాదారులకు ఉపశమనం కలిగిస్తుంది.
