
DNews: May04: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ఎండ తీవ్రంగా ఉంది. ఉదయం 10 గంటలకే బయట అడుగు పెట్టడం భరించలేనంతగా ఉంది. సాయంత్రం 5 గంటలైనా వాతావరణం చల్లబడటం లేదు. అయితే, ఈ నేపథ్యంలో ఒక చల్లని సందేశం అందింది. ఈ రోజు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ రోజు ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయి. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు ఇచ్చింది.
