
DNews: Apr 29: హైదరాబాద్ నగరంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పరుగులు పెట్టారు. మంగళవారం ఉదయం నుంచే ఒక బంక్ నుండి మరొక బంక్‌కి వెళ్లి ఇంధనం కోసం పోటీ పడుతున్నారు. ఫ్యూయల్ స్టేషన్ల ముందు భారీ క్యూలు ఏర్పడి, వాహనదారులు తోసుకుంటూ, తొక్కిసలాటకు గురవుతూ పెట్రోల్/డీజిల్ నింపుకునే ప్రయత్నం చేశారు. ఆదివారం రాత్రి నుంచే నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారం వేగంగా వ్యాపించడంతో, వాహనదారులు కొన్ని లీటర్లైనా నింపుకోవడానికి బంక్‌లకు చేరుకోవడంతో స్టాక్‌లు గంటల్లోనే ఖాళీ అయ్యాయి. కొత్తగా వచ్చిన ట్యాంకర్లలోని ఆయిల్ కూడా త్వరగా అయిపోవడంతో బంక్ యజమానులు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టేశారు.
చర్లపల్లి, ఘట్‌కేసర్ ప్రాంతాల్లోని ఆయిల్ టెర్మినల్స్ నుండి కొత్త లోడ్లు తెచ్చి బంక్‌లకు పంపేందుకు సివిల్ సప్లైస్ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నా, సమయానికి చేరకపోవడంతో సమస్య మరింత పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ దొరికిన బంక్‌ల సమాచారం కొందరు తమ బంధువులకు, స్నేహితులకు ఫోన్ ద్వారా తెలియజేస్తూ, వారిని కూడా తీసుకువెళ్లి వాహనాలు నింపుకునేలా సహాయం చేస్తున్నారు. లంగర్‌హౌస్ రోడ్డులో వరుసగా మూడు బంక్‌లు మూసివేయబడగా, ఫ్లైఓవర్ కింద ఉన్న బంక్‌లో ఉదయం 6 గంటలకు ట్యాంకర్ వచ్చి నింపగా, 10.30 గంటలకే ఖాళీ అయిపోయింది. సాయంత్రం వరకు సంగం ఆలయం దగ్గర బంక్‌లో కూడా స్టాక్ లేకపోయింది. నగరవ్యాప్తంగా సుమారు 50 శాతం బంక్‌లు మూసివేయబడ్డాయి.
మార్చి 24న వెస్ట్ ఏషియా యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడినప్పుడు సివిల్ సప్లైస్, రెవెన్యూ అధికారులు, పోలీసులు తక్షణ చర్యలు తీసుకున్నారు. కానీ గత రెండు రోజులుగా సమస్య తీవ్రతరమవుతున్నా, అధికారులు ఫీల్డ్‌లో కనిపించడం లేదు. పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ వెల్ఫేర్ ఫ్యూయల్ స్టేషన్ వద్ద 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెట్బషీరాబాద్, కొంపల్లి, గజులరామారం, ఐడీపీఎల్, షాపూర్‌నగర్, దుండిగల్ తదితర ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచే వాహనదారులు బంక్‌ల వద్ద క్యూలు కట్టారు. ముందుగా వచ్చిన వారు ఎక్కువ మొత్తంలో నింపుకోవడంతో మళ్లీ కొరత ఏర్పడింది.
