
DNews: Apr27: విశాఖపట్నం జిల్లాలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్బ్రిడ్జ్ (ఆర్ఓబి) కూలిపోవడంతో గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో గందరగోళం నెలకొంది. గాజువాక నియోజకవర్గంలోని 69వ వార్డు పరిధిలోని తుంగలం గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటో నగర్ నుంచి దువ్వాడ మార్గంలో కొత్తగా నిర్మిస్తున్న ఆర్ఓబి పనులు జరుగుతుండగా, మూడు నాలుగు పిల్లర్ల మధ్య ఉన్న స్లాబ్ అకస్మాత్తుగా కూలిపోయింది.
మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఈ ప్రమాదం జరగడంతో, ఘటనా స్థలంలో కొద్దిమంది కార్మికులు మాత్రమే ఉన్నారు. ఒకవేళ ఈ ఘటన పనివేళల్లో జరిగి ఉంటే, భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చాలా సంవత్సరాలుగా జరుగుతున్నాయి. మధ్యలో చాలాసార్లు పనులు నిలిచిపోయాయి. అయినప్పటికీ, రాబోయే 6 నెలల్లో ప్రారంభించేందుకు పనులు పూర్తి వేగంతో సాగుతున్నాయి. ఈలోగా, ఈరోజు అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది.
