
DNews: Mar23: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు. ప్రపంచంలోనే అగ్రగామి ఉక్కు కంపెనీ అయిన ఆర్సెలర్ మిట్టల్ మరియు నిప్పన్ స్టీల్ ఇండియా (ANMC) సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కుమారస్వామి గారు, శ్రీనివాస వర్మ గారు తో కలిసి శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలం, రాజయ్యపేటలో 5,465 ఎకరాల్లో రెండు దశల్లో దీనిని నిర్మించనున్నారు. దీని వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం 17.8 మిలియన్ టన్నులు. ఈ కార్యక్రమానికి పలువురు కంపెనీ ప్రతినిధులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు హాజరయ్యారు.
ఈ ఉక్కు కర్మాగారంలో మొత్తం పెట్టుబడి రూ. 1,35,964 కోట్లు. మొదటి దశలో 2,600 ఎకరాల్లో రూ. 80 వేల కోట్ల వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. 2029 నాటికి ఉత్పత్తిని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్లాంట్ లక్ష మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఆర్సెలర్ మిట్టల్ గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను రెండు దశల్లో అమలు చేయనున్నారు. ఈ ఫ్యాక్టరీకి అనుబంధంగా రూ. 11,198 కోట్ల వ్యయంతో ఒక క్యాప్టివ్ పోర్ట్ నిర్మించనున్నారు. ఈ క్యాప్టివ్ పోర్ట్ మరో 6 వేల ఉద్యోగాలను కల్పిస్తుంది. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో విశాఖపట్నం ప్రాంతం ఒక పారిశ్రామిక కేంద్రంగా మారుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోంది. స్టీల్ ప్లాంట్‌ను ఎన్హెచ్-16తో అనుసంధానించే 4-లేన్ల రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
