
DSports:Sep22: చైనా మాస్టర్స్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టికి రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్‌లో ఈ భారత ద్వయం దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ జోడీ కిమ్ వోన్-హో, సియో సెయుంగ్-జే చేతిలో 19-21, 15-21 తేడాతో ఓటమి పాలైంది.
45 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తొలి గేమ్ ప్రారంభంలో సాత్విక్-చిరాగ్ జోడీ 14-7తో భారీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, కొరియా జోడీ అద్భుతంగా పుంజుకుని గేమ్ ను గెలుచుకుంది. రెండో గేమ్ లో కూడా కొరియా ద్వయం దూకుడు ప్రదర్శించి, భారత జోడీకి అవకాశం ఇవ్వలేదు.
ఈ ఏడాది సాత్విక్-చిరాగ్ జోడీకి ఇది రెండో ఫైనల్ పరాజయం కావడం గమనార్హం. గత వారం హాంగ్ కాంగ్ ఓపెన్ ఫైనల్ లో కూడా వారు చైనా జోడీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ, నిలకడగా రాణిస్తున్న ఈ భారత ద్వయం ప్రపంచ బ్యాడ్మింటన్ లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. ఈ టోర్నీలో రన్నరప్ గా నిలిచినందుకు సాత్విక్-చిరాగ్ జోడీకి రూ. 38.54 లక్షల ప్రైజ్ మనీ లభించింది.
