DSports 17Mar 2026:చెన్నై/తిరువనంతపురం:వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఊహించని విధంగా సంజు శాంసన్ చెన్నై జెర్సీలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తన 11 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకుని సీఎస్కేలో చేరడంపై ఆయన తొలిసారి పెదవి విప్పారు.

  • రాజస్థాన్ రాయల్స్‌ను వీడటంపై సంజు స్పందిస్తూ.. “ప్రతి ఒక్కరికీ ఒక సమయం అంటూ ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్‌లో నా సమయం ముగిసిందని నాకు అనిపించింది. అందుకే నేను ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. ఇది నా కెరీర్‌లో ఒక కొత్త ప్రయాణం. రాజస్థాన్ జట్టుకు, మేనేజ్‌మెంట్‌కు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను” అని భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.
  • ఎంఎస్ ధోనీకి వీరాభిమాని అయిన సంజు, ఆయనతో కలిసి ఆడటం లేదా ఆయన వారసుడిగా జట్టు బాధ్యతలు చేపట్టడం ఒక కల అని గతంలోనే తెలిపారు.ఒక ఆటగాడిగా తనను తాను కొత్త వాతావరణంలో నిరూపించుకోవాలని సంజు భావించారు.
    ఈ భారీ ఒప్పందంలో భాగంగా సంజు సీఎస్కేలోకి రాగా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్లారు.
  • సీఎస్కే అధికారికంగా విడుదల చేసిన వీడియోలో సంజు ‘యెల్లో జెర్సీ’ ధరించి కనిపించారు. “ఈ క్షణం కోసం నేను చాలా కాలంగా వేచి చూస్తున్నాను. ఈ జెర్సీ ధరించడం చాలా గర్వంగా ఉంది. ఒక ఛాంపియన్‌లా అనిపిస్తోంది” అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సంజు రాకతో ధోనీ తర్వాత వికెట్ కీపర్-బ్యాటర్ సమస్యకు సీఎస్కే ఒక శాశ్వత పరిష్కారం కనుగొన్నట్లు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంజు శాంసన్ రూ. 18 కోట్లకు సీఎస్కేకు ట్రేడ్ అవ్వగా, జడేజా రూ. 14 కోట్లకు రాజస్థాన్‌కు వెళ్లారు. మార్చి 30న గౌహతిలో జరగనున్న మ్యాచ్‌లో సంజు తన పాత జట్టు (RR) పైనే మొదటిసారి బరిలోకి దిగబోతుండటం విశేషం.