
DNews: Mar 02: తెలంగాణ మాజీ మంత్రి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. ఈ లేఖలో సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన మైనింగ్ ఈ-ఆక్షన్‌లో భారీ అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. సుమారు 1,100 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌పై స్పష్టత లేకుండా వేలం జరుగుతోందని, స్వతంత్ర విచారణ జరిపి టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమైన సాంకేతిక వివరాలు – లాటిట్యూడ్–లాంగిట్యూడ్, DGPS సర్వే వివరాలు వెల్లడించకపోవడం, భూగర్భ శాస్త్ర నివేదికలు లేకపోవడం, మినరల్ యాక్షన్ రూల్స్–2015 ఉల్లంఘన జరగడం వంటి అంశాలను ఆయన ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టు సూచనలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. పర్యావరణ అనుమతులు పూర్తికాకముందే ప్రిఫర్డ్ బిడ్డర్స్‌ను ప్రకటించడం, కంపెనీల ఎంపికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. డెక్కన్ సిమెంట్స్, NCL ఇండస్ట్రీస్ వంటి సంస్థలకు బ్లాకులు కేటాయించడం పై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సంస్థలు ఇప్పటికే మైనింగ్ అక్రమాలు, కేసులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. వెంటనే టెండర్‌ను రద్దు చేసి, అన్ని అనుమతులు పొందిన తర్వాత మాత్రమే పారదర్శకంగా కొత్త వేలం నిర్వహించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
