
D Spiritual: March 2: ఉగాది సందర్భంగా శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంకు వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ముఖ్య సూచనలు జారీ చేశారు. ఉగాది ఉత్సవాల నేపథ్యంలో ఐదు రోజుల పాటు స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసి, ప్రత్యేక ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకుని స్వామివారిని దర్శించుకుంటుంటారు. పండుగలు, సెలవులు ఉన్న సమయంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ఈ నెలలో ఉగాది పండుగ రానుండటంతో ఇప్పటికే అనేక మంది భక్తులు శ్రీశైలం యాత్రకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఉగాది ఉత్సవాలు మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు స్పర్శ దర్శనాలను పూర్తిగా బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని పాలకమండలి ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఐదు రోజుల పాటు భక్తులకు కేవలం అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
మార్చి 6 నుంచి 15వ తేదీ వరకు నాలుగు విడతలుగా ఆన్‌లైన్ టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రతి స్లాట్‌కు 1500 కరెంట్ బుకింగ్ టికెట్లు, ఆన్‌లైన్ ద్వారా 500 టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. ఉగాది ఉత్సవాలు, దర్శన ఏర్పాట్లపై శ్రీశైలం పారిపాలన భవనంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అలాగే సోమవారం నుంచి పాదయాత్ర భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఐదు లక్షల వాటర్ బాటిల్స్‌ను సిద్ధం చేశామని, పాదయాత్ర మార్గం మరియు పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అన్ని శాఖల సమన్వయంతో ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈసారి ఉగాది సందర్భంగా సుమారు 7 లక్షల మంది భక్తులు శ్రీశైలం చేరుకుంటారని అంచనా వేశారు.
ఇక మార్చి 3న చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నారు. గ్రహణ సమయంలో దర్శనాలను నిలిపివేసి, అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఆలయాన్ని తిరిగి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
