
DET:FEB 26:
బెంగళూరు కోర్టులో ఈడీ భారీ ఛార్జ్‌షీట్:
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన మాజీ నటి మరియు మోడల్ రన్యా రావుకి ఉచ్చు బిగుస్తోంది.సుమారు రూ.102.55 కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ మరియు మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో సుదీర్ఘమైన ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది.రన్యా రావుతో పాటు ఆమె అనుచరుడు తరుణ్ కొండూరు మరియు గోల్డ్ డీలర్ సాహిల్ సకారియా జైన్లను కూడా ఈ కేసులో నిందితులుగా ఈడీ పేర్కొంది.
దుబాయ్ నుండి 127 కేజీల బంగారం స్మగ్లింగ్:
ఈడీ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.మార్చి 2024 నుండి మార్చి 2025 మధ్య కాలంలో ఈ ముఠా సుమారు 127.287 కిలోల విదేశీ బంగారాన్ని అక్రమంగా భారత్‌లోకి తరలించినట్లు అధికారులు గుర్తించారు.దీని విలువ అక్షరాలా రూ.102.55 కోట్లు. దుబాయ్ నుండి అక్రమ మార్గాల్లో బంగారాన్ని తెచ్చి ఇక్కడి స్థానిక మార్కెట్లో విక్రయించి ఆ డబ్బును హవాలా మార్గాల్లో మళ్ళించినట్లు ఛార్జ్‌షీట్‌లో వివరించారు.
విమానాశ్రయంలో పట్టుబడిన వైనం:
అసలు ఈ కేసు గత ఏడాది మార్చి 3,2025న ప్రారంభమైంది.దుబాయ్ నుండి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రన్యా రావును డిఆర్ఐ అధికారులు తనిఖీ చేయగా ఆమె వద్ద 14.213 కిలోల బంగారం లభించింది.ఆ సమయంలో ఆమె ఆ బంగారాన్ని తన శరీరానికి బ్యాండేజీలతో కట్టుకుని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటం అప్పట్లో సంచలనం సృష్టించింది.ఆ తర్వాత ఆమె నివాసంలో జరిపిన సోదాల్లో రూ.2.67 కోట్ల నగదు.. రూ. 2.06 కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
రూ. 34 కోట్ల ఆస్తుల జప్తు:
ఈ కేసులో మనీ లాండరింగ్ కోణాన్ని విచారిస్తున్న ఈడీ ఇప్పటికే రన్యా రావుకు చెందిన రూ.34.12 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది.స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బును వివిధ బ్యాంక్ ఖాతాల ద్వారా మళ్లించి వాటిని చట్టబద్ధమైన వ్యాపార లావాదేవీలుగా చూపించే ప్రయత్నం చేశారని ఈడీ స్పష్టం చేసింది.ప్రస్తుతం రన్యా రావు బెంగళూరులోని సెంట్రల్ జైలులో ఉన్నారు.ఈమె కర్ణాటకకు చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి పెంపుడు కుమార్తె కావడంతో ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
