
D Spiritual: Feb 21: బ్రహ్మాండం అంతటా ప్రతిధ్వనించే ఓంకారం ఆవిర్భవించిన రోజు శనివారం కావడం విశేషంగా భావించబడుతుంది. ఇదే పవిత్ర దినాన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆకాశరాజు పుత్రిక అయిన పద్మావతి అమ్మవారును పరిణయమాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. కలియుగ దైవమైన శ్రీవారు భక్తులకు మొదటిసారి దర్శనమిచ్చిన రోజూ శనివారమేనని ప్రతీతి ఉంది. అందువల్ల ఈ రోజును భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.
శనివారం రోజున స్వామివారిని మనస్ఫూర్తిగా పూజించే భక్తులకు ప్రత్యేక రక్షణ ఉంటుందని విశ్వాసం. శని ప్రభావం పీడించకుండా కాపాడుతానని శనీశ్వరుడు శ్రీవారికి వరం ఇచ్చినట్లు కథనాలు చెబుతాయి. అందుకే శని దోషాలు ఉన్నవారు శనివారాల్లో తిరుమల నాథుడిని దర్శించుకుని, వేంకటేశ్వరుని కృపతో శని పీడ నుంచి విముక్తి పొందాలని ప్రార్థిస్తారు.
ఆలయ నిర్మాణ చరిత్రలో కూడా శనివారానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆనంద నిలయ ఆలయ నిర్మాణం ప్రారంభమైన రోజు, శ్రీవారు దివ్య మంగళ స్వరూపంతో గృహప్రవేశం చేసిన ఘడియలు శనివారమేనని విశ్వసిస్తారు. దుష్ట శిక్షణకు సంకేతమైన సుదర్శన చక్రం ఆవిర్భవించిన రోజు కూడా శనివారమేనని భావించబడుతోంది.
ఎవరైతే ఏడుకొండలవాడిని శనివారాల్లో దర్శించుకుంటారో వారి కోరికలు నెరవేరుతాయని వేద పండితులు చెబుతారు. అందుకే సాధారణ రోజుల కంటే శనివారాల్లో తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోతుంటాయి. ఈ పవిత్ర దినాన తలనీలాలు సమర్పించడం లేదా గోవింద నామస్మరణ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
