
DNews: Feb 18: ఇబ్రాహింపట్నం మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలపై పెద్ద రాజకీయ డ్రామా చోటుచేసుకుంది. 19వ వార్డు కౌన్సిలర్ అకుల యాదగిరి కనిపించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు పోలీసులను యాదగిరిని కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు బుధవారం యాదగిరిని హైకోర్టులో హాజరు పరిచారు. యాదగిరి తన వాంగ్మూలంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తనను హైదరాబాద్‌కు తీసుకెళ్లి 12 గంటలపాటు అక్కడ ఉంచి, అనంతరం బలవంతంగా చీరాలకు తరలించారని తెలిపారు. అక్కడ ఒక రిసార్ట్‌లో రెండు రోజులపాటు నిర్బంధంలో ఉంచారని ఆయన కోర్టుకు వివరించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం తాను నిన్న కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యానని కూడా తెలిపారు. ఈ వాంగ్మూలం అనంతరం హైకోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఇబ్రాహింపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలపై హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది.
ఇక మరోవైపు, యాదగిరి భార్య వసంత తన భర్తను “క్యాంప్” పేరుతో అపహరించారని ఆరోపిస్తూ ఇబ్రాహింపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు IPC 363 కింద కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి పై వసంత అనుమానాలు వ్యక్తం చేశారు.
