
DNews: Feb18: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఇళ్ల నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సహాయం రూ. 1.80 లక్షల నుంచి రూ. 2.50 లక్షలకు పెంచారు. సొంత భూమి ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గత సంవత్సరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తులు అందాయి. ప్రస్తుతం అర్హులను గుర్తించడానికి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. తరువాత అర్హులైన వారిని గుర్తించి లబ్ధిదారుల జాబితాను తయారు చేస్తారు. త్వరలో లబ్ధిదారుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో పీఎంఏవై పథకం కింద ఇళ్ల నిర్మాణానికి విడతల వారీగా రూ. 1.80 లక్షలు అందించారు. కేంద్రం రూ. 1.50 లక్షలు ఇస్తే, ఏపీ ప్రభుత్వం తన వాటాగా రూ. 30 వేలు అందిస్తుంది. కానీ పేదలకు మరింత సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు దానిని రూ. 2.50 లక్షలకు పెంచాలని నిర్ణయించారు.
