
D Spiritual: Jan 30: మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
మార్చి 3వ తేదీ సాయంత్రం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 6.47 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగానే ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది.
సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం పునఃప్రారంభమవుతుంది.
ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన అష్టదళ పాద పద్మారాధన సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
వీటితో పాటు ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రుల దర్శనం, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది.
ఈ విషయాలను భక్తులు గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికను అనుగుణంగా రూపొందించుకోవాలని టీటీడీ కోరింది. ఈ ప్రకటనను టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి విడుదల చేశారు.
