
DNews: Jan6: గత ఏడాది కాలంలో ఏసీఏ చాలా అభివృద్ధి చెందిందని ఏసీఏ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాఖ్యానించారు. ఈరోజు (మంగళవారం) విజయవాడలో ఏసీఏ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభమైంది. ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సనా సతీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ…. విశాఖపట్నం స్టేడియం పునరుద్ధరించబడింది. బీ గ్రౌండ్‌తో పాటు ఏ గ్రౌండ్‌లో కూడా విశ్రాంతి గదులు ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. విశాఖపట్నం స్టేడియంలో కుర్చీలను మారుస్తున్నట్లు ఆయన వివరించారు. మహిళా జట్టు మెంటార్‌గా మిథాలీ రాజ్‌ను నియమించబోతున్నట్లు కేశినేని శివనాథ్ వెల్లడించారు.
ఏసీఏ చరిత్రలో గతంలో ఎప్పుడూ ఇన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగలేదని ఆయన అన్నారు. మహిళల ప్రపంచ కప్ మ్యాచ్‌లు కూడా జరిగాయని ఆయన అన్నారు. మహిళా క్రికెటర్ల పేర్లు రెండు గేట్లపై పెట్టామని ఆయన వెల్లడించారు. త్వరలో మహిళా క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మంగళగిరి స్టేడియంను క్రీడా కేంద్రంగా మార్చబోతున్నట్లు చెప్పారు. మూలపాడును బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా అభివృద్ధి చేయబోతున్నామని వివరించారు. కడప స్టేడియం మౌలిక సదుపాయాలు బాగా లేవని చెప్పారు. అక్కడ గదులు నిర్మించబోతున్నామని చెప్పారు. గ్రామీణ క్రికెటర్లను గుర్తించి, రూరల్ టాలెంట్ సెర్చ్ పేరుతో కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆంధ్ర జట్టుకు విదేశీ కోచ్‌ను నియమిస్తామని వివరించారు. ప్రపంచ కప్ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మహిళా క్రికెటర్లను ప్రోత్సహించారని చెప్పారు. ఆ జట్టు ప్రపంచ కప్ గెలవడం ఆనందంగా ఉందని కేశినేని శివనాథ్ అన్నారు.
