
DSports Dec13:కోల్‌కతా: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ (Lionel Messi) భారత పర్యటనకు రావడం దేశంలోని ఫుట్‌బాల్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ (GOAT Tour of India) పర్యటనలో భాగంగా మెస్సీ కోల్‌కతా చేరుకున్నారు. 2011 తర్వాత ఆయన ఇక్కడికి రావడం ఇదే తొలిసారి కావడంతో అభిమానులు భారీ ఎత్తున స్టేడియానికి చేరుకుంటున్నారు.
ఈ సందర్భంగా, మెస్సీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఓ మహిళా అభిమాని తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెస్సీని చూడటం కోసం ఆమె ఏకంగా తన హనీమూన్నే రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది.
ఆమె ఏమన్నారంటే…
అభిమానుల సందడి మధ్య మీడియాతో మాట్లాడిన ఆ లేడీ ఫ్యాన్, “గత శుక్రవారమే నాకు పెళ్లి అయింది. మెస్సీ ఇక్కడికి వస్తున్నాడని తెలిసి మా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. వాస్తవానికి ఈ రోజు మా హనీమూన్ షెడ్యూల్ ఉంది. కానీ, మెస్సీని చూడటం కోసం నేను, నా భర్త హనీమూన్‌ను రద్దు చేసుకునే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే ఇక్కడికి వచ్చి దాదాపు రెండు గంటలైంది. మరికొద్ది సేపట్లో మెస్సీని చూడబోతున్నాం. ఇది జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే అవకాశం. హనీమూన్‌కి ఎప్పుడైనా వెళ్లొచ్చు… అందుకే ఈ అవకాశాన్ని చేజార్చుకోవాలని అనుకోలేదు,” అని తన ఉద్వేగాన్ని వ్యక్తం చేసింది.
మెస్సీని ప్రత్యక్షంగా చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్కొక్కరు తమ అభిమానాన్ని ఒక్కో రకంగా చాటుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
