
D Spiritual: Dec 12: పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి 2026 జనవరి 14 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనున్నారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 76, తెలంగాణలో 57, తమిళనాడులో 73, కర్ణాటకలో 21, పాండిచ్చేరిలో 4 కేంద్రాల్లో ఈ ప్రవచనాలు జరుగుతాయి. అదనంగా న్యూఢిల్లీ, ఒడిశాలో ఒక్కొక్క కేంద్రంలో కూడా తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనున్నారు. ధనుర్మాసంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం చేయడం విశేషం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో కూడా తిరుప్పావై ప్రవచనాలు జరుగుతాయి.
ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినట్టు పురాణాలు చెబుతాయి. ఈ వ్రతం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉండే వరం లభిస్తుందని విశ్వాసం. ద్వాపరయుగంలో గోపికలు కూడా ఈ వ్రతాన్ని పాటించి శ్రీకృష్ణుని కృపను పొందారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడింది. ఈ వ్రతం ఎలా చేయాలో వివరించేందుకు శ్రీ గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు.
తిరుప్పావై యొక్క సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు మాత్రమే చేయడం కాకుండా, అందరినీ కలుపుకుని ఆచరించినప్పుడు మరింత గొప్ప ఫలితం లభిస్తుందని పండితుల అభిప్రాయం. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం నేటికీ కొనసాగుతోంది.
