
D Spiritual: Dec 11: అయ్యప్ప మాల ధరించిన వారు తప్పనిసరిగా కొన్ని విశిష్ట నియమాలను పాటించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా నవంబర్–డిసెంబర్ నుండి జనవరి–ఫిబ్రవరి వరకు అయ్యప్ప మాల, శివమాల, వెంకటేశ్వర మాల, భవాని మాల వంటి వివిధ దేవతలకు సంబంధించిన మాలలు ధరిస్తారు. కార్తీక మాసం మొదలుకుని శివరాత్రి వరకు ఈ మాలలు ధరించడం ఆనవాయితీ. ఈ కాలంలో మాల ధరించిన వారు అత్యంత నిష్టతో జీవించాలి. ప్రతిరోజూ రెండు సార్లు స్నానం చేయడం, ఆచార నియమాలను పాటించడం అత్యంత అవసరం.
మాల ధరించిన కాలంలో మాంసాహారం పూర్తిగా ముట్టకూడదు. అలాగే మద్యం, పొగ తాగే అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఆహారంలో కూడా ఉల్లి, వెల్లుల్లి వంటి తామస గుణాలను కలిగించే పదార్థాలను వాడకూడదు. పూర్తిగా సాత్విక ఆహారం మాత్రమే సేవించాలి. మధ్యాహ్నం భిక్ష తీసుకోవడం, రాత్రికి అల్పాహారంతో గడపడం నియమం.
అయ్యప్ప దీక్షలో ఉన్నవారు ఇతరులను “స్వామి” అని పిలవాలి. మహిళలను “మాత” అని సంభోదించాలి. పరుపులు, మంచాలపై నిద్రించకుండా కటిక నేలపై నిద్రించడం దీక్షలో ముఖ్యమైన భాగం. బహిష్టు అయిన మహిళలను చూడరాదు; అనుకోకుండా చూసిన సందర్భంలో తలస్నానం చేసి, శరణు ఘోష పలికే వరకు ఏదైనా నీళ్లు కూడా తాకరాదు అంటారు. అయ్యప్ప స్వామికి “శరణు ఘోష” ఎంతో ప్రీతి కాబట్టి నిరంతరం భజనలో, స్మరణలో ఉండాలి.
ఇదే విధంగా కటోర నిష్టతో అస్కలిత బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అష్టరాగాలు, పంచేంద్రియ విక్షేపాలు, త్రిగుణాలు, విద్య–అవిద్యలతో సంబంధమైన 18 గుణాలకు దూరంగా ఉండాలి. మొత్తం మీద మాల వేసుకున్న నాటి నుండి మాల తీసే రోజు వరకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక నియమాలను కట్టుదిట్టంగా అనుసరించాలి.
