DET:DEC 09:
అఖండ 2 కు అడ్డంకులు తొలగిపోయాయి:
నందమూరి బాలకృష్ణ,దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2 తాండవం సినిమాకు చివరి నిమిషంలో ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి.ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది,కానీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని సమస్యల కారణంగా రిలీజ్ వాయిదా పడింది.బాలయ్య అభిమానులు ఈ విషయంపై తీవ్ర నిరాశ చెందారు.అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

మద్రాస్ హైకోర్టు స్టే ఎత్తివేత:
బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు గతంలో అఖండ 2 విడుదలపై తాత్కాలికంగా స్టే విధించింది.14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థకు ఎరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఆర్థిక వివాదాలే దాదాపు 28 కోట్ల బకాయిలు ఈ స్టేకి ప్రధాన కారణం.అయితే నిర్మాతలు ఈరోజు డిసెంబర్ 9,2025 కోర్టుకు సెటిల్‌మెంట్ ఒప్పందాన్ని సమర్పించడంతో మద్రాస్ హైకోర్టు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతో బాలకృష్ణ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

కొత్త విడుదల తేదీ ఖరారు:
మద్రాస్ హైకోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో అఖండ 2 సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది.ఈ చిత్రాన్ని డిసెంబర్ 12,2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు దాదాపుగా నిర్ణయించారు.తొలుత డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా వారం రోజులు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ అడ్డంకి తొలగిపోవడంతో,బాలయ్య అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.