
D Spiritual: Dec 6: భారతదేశంలో ఎన్నో శివాలయాలు అద్భుతమైన శిల్పకళతో నిర్మించబడి ఉన్నాయి. అయితే కొన్ని ఆలయాలకు మాత్రం ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. వాటిలో ఒకటి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలోని భోజ్‌పూర్‌లో ఉన్న ఈ శివాలయం. పురాణాల ప్రకారం, వనవాస సమయంలో తమ తల్లి కుంతీదేవికి పూజ చేసుకునేందుకు ఒక శివాలయం కావాలని పాండవులు భావించగా, వారు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.
ఈ ఆలయంలోని శివలింగం ఒకే రాతిమీద చెక్కబడిన మహద్భుత శిల్పం. దీని ఎత్తు సుమారు 7.5 అడుగులు, చుట్టుకొలత 17.8 అడుగులు అని పురావస్తు శాఖ తెలిపింది. ఈ కారణంగా దీన్ని ‘తూర్పు సోమనాథ్’ అని కూడా పిలుస్తారు. ఈ శివలింగం భారతదేశంలోని అందరి శివలింగాలలో అత్యంత ఎత్తయిందని పురావస్తు శాఖ నిర్ధారించింది. ఈ ఆలయ నిర్మాణ శైలి 11–13వ శతాబ్దాలకు చెందినదిగా భావిస్తున్నారు.
పాండవులు వనవాస సమయంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తూ, భీముడు ప్రతిరోజూ మోకాళ్లపై కూర్చుని శివలింగానికి పూలను సమర్పించేవారని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ ఆలయానికి ఎలాంటి శిలాశాసనాలు లేకపోవడం గమనార్హం, అందువల్ల చారిత్రక ఆధారాలు పూర్తిగా లేవు.
ఈ ఆలయం మొత్తం రాతితో అద్భుతంగా నిర్మించబడింది. కానీ ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలోనే పాండవులు రాత్రికి రాత్రే మాయమైనట్లు పురాణాలు చెబుతాయి. దీంతో ఈ ఆలయం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఒకవేళ ఇది పూర్తిగా నిర్మించబడివుంటే, భారతదేశంలో అత్యంత గొప్ప శివాలయాలలో మొదటి స్థానంలో నిలిచేదని నిపుణులు భావిస్తున్నారు.
