
DSports 4 Dec:న్యూ ఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందిన సర్వజ్ఞ సింగ్ కుష్వాహ ప్రపంచ చెస్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించాడు. కేవలం 3 సంవత్సరాల, 7 నెలల, 20 రోజుల అతి చిన్న వయసులో ప్రతిష్టాత్మక FIDE (ఫిడే) రేటింగ్ సాధించిన ఆటగాడిగా సర్వజ్ఞ గుర్తింపు పొందాడు.
దీంతో, అంతకుముందు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనీష్ సర్కార్ (3 ఏళ్ల 8 నెలలు) పేరిట ఉన్న రికార్డును ఈ బుడతడు బద్దలు కొట్టాడు. ఈ ఘనతతో సర్వజ్ఞ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) ర్యాపిడ్ రేటింగ్‌లో 1572 పాయింట్లు సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.
ఈ ఘనతపై సర్వజ్ఞ తండ్రి స్పందిస్తూ, “మా బాబు చెస్‌లో ఉజ్వల భవిష్యత్తును కలిగి ఉన్నాడు. అతడు త్వరలోనే గ్రాండ్‌మాస్టర్ అవుతాడని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.
సర్వజ్ఞ కుష్వాహ సాధించిన ఈ ప్రపంచ రికార్డు భారతదేశంలో యువ చెస్ ప్రతిభకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.
