
DSports 28 Nov:న్యూఢిల్లీ: మొట్టమొదటిసారిగా నిర్వహించిన అంధ మహిళల టీ20 ప్రపంచకప్ 2025ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. గురువారం న్యూఢిల్లీలో భారత జట్టు సభ్యులు ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జట్టు సాధించిన విజయం భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
ప్రధాని నివాసంలో సుమారు 45 నిమిషాల పాటు ఈ ఆత్మీయ ఇష్టాగోష్ఠి జరిగింది. ఈ సందర్భంగా క్రీడాకారిణులు తమ విజయ ప్రయాణంలోని కష్టాలు, సవాళ్లు, పట్టుదలను ప్రధానితో పంచుకున్నారు. జట్టు కెప్టెన్, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన దీపికా టిసి ప్రధానితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆమె పాటలు బాగా పాడుతుందని తెలుసుకున్న ప్రధాని, ఒక పాట పాడమని కోరగా… దీపిక శివుడి భక్తి గీతం ఆలపించి అభినందనలు అందుకున్నారు.ఒడిశాకు చెందిన ఫూలా సరెన్ వంటి కీలక ఆటగాళ్ల కృషిని ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు.ఈ సందర్భంగా జట్టు సభ్యులు సంతకం చేసిన బ్యాట్‌ను దీపికా ప్రధాని మోదీకి బహూకరించారు. అలాగే, కొన్ని క్రికెట్ బంతులపై ప్రధాని సంతకాలు తీసుకున్నారు.
ఓటమెరుగని చారిత్రక విజయం
భారత జట్టు ఈ టోర్నమెంట్‌లో ఓటమెరుగని జట్టుగా నిలిచి టైటిల్ గెలుచుకోవడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. నవంబర్ 23, 2025న కొలంబోలో జరిగిన ఫైనల్‌లో భారత జట్టు నేపాల్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.ఫైనల్‌లో ఫూలా సరెన్ (27 బంతుల్లో 44 నాటౌట్) అద్భుత ప్రదర్శనతో భారత్‌కు విజయాన్ని అందించింది. “ఇది కేవలం క్రీడా విజయం మాత్రమే కాదు. కఠోర శ్రమ, సమష్టి కృషి, దృఢ సంకల్పానికి ఇది ఒక అద్భుత ఉదాహరణ. ప్రతి క్రీడాకారిణీ నిజమైన ఛాంపియనే. ఈ విజయం మన దేశంలో మహిళల క్రీడలకు కొత్త ఊపిరినిస్తుంది” అని ప్రధాని తన ట్విట్టర్ (ఎక్స్) సందేశంలో పేర్కొన్నారు.
అంధ మహిళల క్రికెట్ చరిత్రలో ఈ విజయం ఒక మైలురాయిగా నిలిచింది. ఈ విజయం, క్రీడల ద్వారా దివ్యాంగులకు సమాజంలో సాధికారత లభిస్తుందనే గొప్ప సందేశాన్ని ఇచ్చింది.
