
DSports 25 Nov:(బంగ్లాదేశ్): భారత మహిళా కబడ్డీ జట్టు మరోసారి విశ్వవిజేతగా నిలిచి, భారత క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మహిళల కబడ్డీ ప్రపంచకప్-2025 ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత్… వరుసగా రెండోసారి కబడ్డీ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.
సోమవారం ఢాకా వేదికగా జరిగిన ఉత్కంఠభరిత తుదిపోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, బలమైన చైనీస్ తైపీ జట్టును 35-28 పాయింట్ల తేడాతో చిత్తు చేసింది.
విజయం వెనుక కీలక అంశాలు:
టోర్నీ ఆసాంతం భారత జట్టు పరాజయం అన్నది లేకుండా గ్రూప్ దశ, సెమీస్‌లో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సెమీస్‌లో ఇరాన్‌ను 33-21 తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.ఫైనల్ మ్యాచ్ నువ్వా-నేనా అన్నట్టు సాగింది. తొలి అర్ధభాగంలో 20-16తో భారత్ స్వల్ప ఆధిక్యం సాధించింది. రెండో అర్ధభాగంలో కెప్టెన్ రీతూ నేగి నాయకత్వం, రైడర్ సంజు దేవి మెరుపు రైడింగ్‌లు, పుష్ప రాణా సహా డిఫెండర్ల పటిష్ట ట్యాకిల్స్‌తో భారత్ విజయాన్ని ఖాయం చేసుకుంది.అద్భుత ఆటతీరు కనబర్చిన సంజూ దేవికి ‘అత్యంత విలువైన క్రీడాకారిణి (Most Valuable Player)’ అవార్డు దక్కింది.
ఈ చారిత్రక విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కబడ్డీలో భారతీయ మహిళల సత్తాను ఈ విజయం మరోసారి ప్రపంచానికి చాటింది.
