
DNews: Nov 22: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సైబర్ నేరాలను అరికట్టేందుకు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. చారిత్రక చార్మినార్ వద్ద ప్రతి మంగళవారం మరియు శనివారం సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో సైబర్ నేరాలపై జాగ్రత్తలు తీసుకోవాలనే అవగాహన పెంచే ప్రయత్నం జరుగుతోంది. అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది సైబర్ మోసాలకు బలవుతున్నారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనే ప్రతి రోజు ఒక కోటి రూపాయలు సైబర్ నేరాల కారణంగా నష్టపోతున్నారని వెల్లడించారు. OTP ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాలు జరుగుతున్నాయని చెప్పారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించినప్పుడు భయపడకూడదని, భయపడటం వాళ్లకు బలం అవుతుందని హెచ్చరించారు. వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకూడదని, అలా చేస్తే మోసపోవచ్చని సూచించారు. ఎవరైనా సైబర్ నేరానికి బలైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని ఆయన సూచించారు. అదనంగా, “సైబర్ సింబా” అనే స్వచ్ఛంద వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చామని, అందరూ ఇందులో పాల్గొని సైబర్ నేరాల నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
