
DSports 19 Nov :టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల జరిగిన కోల్‌కతా టెస్టులో భారత జట్టు ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జట్టులో మూడో స్థానం విషయంలో జరుగుతున్న ప్రయోగాలపై ఆయన దృష్టి సారించారు. ఇటీవల ఆ స్థానంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఆడించడంపై స్పందించిన గంగూలీ, “వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా, అతను మంచి క్రికెటర్, చక్కగా బౌలింగ్ చేయగలడు, అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. కానీ టెస్టు క్రికెట్లో మూడో స్థానం అతడికి సరిపోదు” అని అభిప్రాయపడ్డారు. టెస్టుల్లో మొదటి ఐదు స్థానాల్లో కచ్చితంగా స్పెషలిస్ట్ బ్యాటర్లు మాత్రమే ఉండాలని గంగూలీ సూచించారు, ముఖ్యంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి దేశాల్లో సుందర్ ఈ స్థానానికి సరిపోడని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, సుందర్ ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసిన కోల్‌కతా టెస్టులో నలుగురు స్పిన్నర్లను తీసుకోవాల్సిన అవసరం లేదని, పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే ప్రధాన స్పిన్నర్లు 20-30 ఓవర్లు వేయగలరని తెలిపారు. ఈ విషయంలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ దృష్టి సారించాలని గంగూలీ హితవు పలికారు.
