
DNews: Nov17: బంగ్లాదేశ్ అల్లర్ల ఘటనపై ఆ దేశ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష విధించింది. అల్లర్లు కేసుపై ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చిన కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. బంగ్లాదేశ్‌లో గతేడాది అల్లర్లు చెలరేగి తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లలో 1400 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో హసీనాపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని ఆమె ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు సైతం కోర్టు మరణశిక్ష విధించింది.
మాజీ పోలీసు చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్-మామున్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.
ఆగస్టు 5న ఢాకాలో నిరసనకారులపై సైన్యం కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్లు మరియు ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించాలని ఆమె ఆదేశించిందని మరో న్యాయమూర్తి ఐసిటి తీర్పులో పేర్కొన్నారు. దర్యాప్తు నివేదికను ఈ మేరకు చదివి వినిపించారు. గాయపడిన వారికి వైద్య చికిత్స నిరాకరించారని చెప్పబడింది. అధికారంలో ఉండటానికి ఆమె బలప్రయోగం చేసిందని చెప్పబడింది. తీర్పు నేపథ్యంలో ఐసిటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
