
DET:NOV 12:
దుల్కర్ సల్మాన్ అభిమానులకు చేదువార్త: ‘కాంత’ లీగల్ చిక్కుల్లో:
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా,రానా దగ్గుబాటి సహ-నిర్మాతగా రూపొందించిన పీరియాడిక్ డ్రామా ‘కాంత’ చిత్రం విడుదలకు కొద్ది రోజుల ముందే ఊహించని సమస్యలో చిక్కుకుంది.నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది.ఈ పరిణామం దుల్కర్ సల్మాన్ అభిమానులకు నిరాశ కలిగించే విషయం.
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ప్రముఖ నటుడి మనవడు:
ఈ సినిమాపై కోర్టులో కేసు వేసిన వ్యక్తి మరెవరో కాదు,తమిళ సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజ నటుడు మరియు గాయకుడు ఎం.కె.త్యాగరాజ భాగవతార్ మనవడు.ఆయన పేరు బి.త్యాగరాజన్.కాంత చిత్రం తన తాతను తప్పుగా,అగౌరవపరిచే విధంగా చిత్రీకరించిందని ఆరోపిస్తూ ఆయన చెన్నై కోర్టును ఆశ్రయించారు.
చిత్రంపై తీవ్ర ఆరోపణలు:
అప్పట్లో తమిళ సినిమా తొలి సూపర్ స్టార్ గా పేరొందిన త్యాగరాజ భాగవతార్ను ఈ సినిమాలో చెడ్డ నడవడిక కల వ్యక్తిగా, చివరి రోజుల్లో పేదరికంలో,అంధత్వంలో జీవించి,అప్పులతో మరణించినట్లుగా చూపించారని త్యాగరాజన్ ఆరోపించారు. అయితే,వాస్తవానికి తన తాతగారు ఎంతో వినయంగా,దైవభక్తితో,దయగల వ్యక్తిగా జీవించారని,ఎప్పుడూ మద్యం, ధూమపానం అలవాట్లు లేవని,మరణించే వరకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
విడుదలపై స్టే కోరిన పిటిషనర్:
పబ్లిక్ ఫిగర్ జీవితం ఆధారంగా సినిమా తీసేటప్పుడు,వారి కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని,కానీ కాంత చిత్ర నిర్మాతలు ఆ నియమాన్ని పాటించలేదని త్యాగరాజన్ వాదించారు.ఈ చిత్రం వల్ల తమ తాతగారి గౌరవానికి భంగం వాటిల్లుతుందని,కాబట్టి సినిమాను థియేటర్లలో లేదా ఓటీటీలో విడుదల చేయకుండా శాశ్వతంగా నిలుపుదల చేయాలని ఆయన కోర్టును కోరారు.
స్పందన కోరిన న్యాయస్థానం,అనిశ్చితిలో విడుదల:
ఈ పిటిషన్ను విచారించిన చెన్నై సిటీ ఏడవ అసిస్టెంట్ సిటీ సివిల్ కోర్టు..దుల్కర్ సల్మాన్,ఇతర చిత్ర నిర్మాతలు దీనిపై నవంబర్ 18 లోగా సమాధానం దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.అయితే,సినిమా విడుదల మాత్రం నవంబర్ 14న ఉంది.చిత్ర యూనిట్ ఇది భాగవతార్ గారి జీవిత చరిత్ర కాదని,కేవలం స్ఫూర్తితో తీసిన కల్పిత కథ అని గతంలోనే చెప్పినప్పటికీ,కోర్టు ఆదేశాలతో నవంబర్ 14న ‘కాంత’ విడుదల అనిశ్చితిలో పడింది.
