
DET:NOV 03:
చిరంజీవి ధాబా పేరు వివాదంపై స్పష్టత:నటుడి అనుమతి తీసుకున్నట్లు యజమాని వెల్లడి!
కోర్టు ఉత్తర్వులు,లీగల్ నోటీసు:
హైదరాబాద్‌లోని నల్లగండ్లలో ఉన్న చిరంజీవి ధాబా పేరుతో నడుస్తున్న రెస్టారెంట్ ఇటీవల వార్తల్లో నిలిచింది.టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పేరు,ఆయన పోలికలను అనుమతి లేకుండా వాడటంపై ఇటీవల హైదరాబాద్ సివిల్ కోర్టు ఆయన వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు ఆదేశాలు జారీ చేసింది.ఈ ఉత్తర్వుల నేపథ్యంలో,చిరంజీవి పేరును ఉపయోగిస్తున్న దాదాపు 50 నుండి 60 ఇతర సంస్థలతో పాటు ఈ ధాబా యజమానికి కూడా లీగల్ నోటీసు అందింది.ఈ పరిణామం అభిమానుల్లో,ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
యజమాని స్పందన: అభిమానంతోనే ఆ పేరు:
ఈ వివాదంపై రెస్టారెంట్ యజమాని రవి తేజ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.తన ధాబా పేరు వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన వివరించారు.మిలియన్ల మంది అభిమానుల మాదిరిగానే,మేము కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి ఆరాధకులం. ఆయనపై ఉన్న ప్రేమ,గౌరవంతో మంచి ఉద్దేశంతోనే ఈ రెస్టారెంట్‌కు ఆ పేరు పెట్టాం అని ఆయన పేర్కొన్నారు.తనకు వచ్చిన నోటీసు చట్టబద్ధంగా సరైనదేనని ఆయన అంగీకరించారు.
శుభపరిణామం:మెగాస్టార్ కృపా కటాక్షం:
యజమాని రవి తేజ్,మెగాస్టార్ చిరంజీవి గారి బృందాన్ని వ్యక్తిగతంగా కలిసి,తాము అనుసరించిన విధానం,తమ మంచి మనసును వివరించారు.తమ ఉద్దేశం స్వచ్ఛమైందని అర్థం చేసుకున్న తరువాత,చిరంజీవి గారు ఆశ్చర్యకరంగా,దయతో వారి అభ్యర్థనను మన్నించారని యజమాని వెల్లడించారు.ఆయన స్పందించిన తీరు,చూపించిన దయ మమ్మల్ని కదిలించాయి.మా రెస్టారెంట్‌ను అదే పేరుతో కొనసాగించడానికి చిరంజీవి గారు తమ అంగీకారం తెలిపారు అని రవి తేజ్ సంతోషం వ్యక్తం చేశారు.
