హైదరాబాద్‌, ఆగస్టు 3: తెలంగాణలో ఈ ఏడాది డిగ్రీ ఫస్టియర్‌లో ఇప్పటివరకు సుమారు 1.90 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరిలో 1.61 లక్షల మంది ఆన్‌లైన్‌ ద్వారా, మరో 28 వేల మంది ఆఫ్‌లైన్‌ విధానంలో అడ్మిషన్లు తీసుకున్నారు.

ఫార్మసీ కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత మరికొందరు విద్యార్థులు డిగ్రీలో చేరే అవకాశం ఉందని దోస్త్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వీ. బాలకిష్టారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

డిగ్రీ ఫస్టియర్‌ సీట్ల భర్తీకి విద్యార్థులకు మరో అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా దోస్త్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ఫేజ్‌ షెడ్యూల్‌ను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఆగస్టు 6 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఆగస్టు 20, 21 తేదీల్లో విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 22న ఇంట్రా కాలేజీ స్లైడింగ్‌ ద్వారా సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. ఈ అవకాశాన్ని డిగ్రీలో ఇంకా ప్రవేశం పొందని విద్యార్థులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

By Ramya