
అంతర్జాతీయంగా పెరుగుతున్న రాజకీయ, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో నెదర్లాండ్స్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, కెనడా నుంచి సుమారు 86 టన్నుల బంగారాన్ని లండన్‌లోని ప్రతిష్ఠాత్మక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వాల్ట్‌లకు తరలించినట్లు అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుత ట్రేడ్ వార్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో బంగారం కొనుగోలు, విక్రయాలను సులభతరం చేసేందుకు ఈ చర్య చేపట్టినట్లు తెలిపింది.
అంతర్జాతీయంగా తీవ్ర రాజకీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న వేళ నెదర్లాండ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, కెనడాల్లో ఉన్న తమ బంగారు నిల్వల్లో సుమారు 86 టన్నుల పసిడిని లండన్‌లోని ప్రముఖ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్ట్‌లకు తరలించినట్లు డచ్ సెంట్రల్ బ్యాంక్ (DNB) అధికారికంగా వెల్లడించింది.
బిలియన్ల డాలర్ల విలువైన ఈ భారీ బంగారు నిల్వలను మరింత సురక్షితమైన ప్రాంతానికి తరలించడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు నెదర్లాండ్స్ ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై నెలకొన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది.
ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు మధ్య నెదర్లాండ్స్ తన బంగారం నిల్వలను అమెరికా నుంచి లండన్‌కు తరలించే కీలక ప్రక్రియను చేపట్టింది. ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను డచ్ బ్యాంక్ పక్కా ప్రణాళికతో పూర్తి చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
మొదటి దశలో కెనడా, అమెరికాలోని బ్యాంకుల్లో ఉన్న సుమారు 27 టన్నుల బంగారాన్ని నెదర్లాండ్స్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి ఆ బంగారాన్ని లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు చేర్చారు. అయితే మిగిలిన బంగారం తరలింపులో ఎదురయ్యే రవాణా ఖర్చులు, భద్రతాపరమైన నష్టభయాలను దృష్టిలో ఉంచుకుని మరో వ్యూహాన్ని అనుసరించారు. న్యూయార్క్‌లో ఉన్న కొంత బంగారాన్ని అక్కడే విక్రయించి, వచ్చిన మొత్తంతో లండన్ మార్కెట్‌లో తిరిగి బంగారాన్ని కొనుగోలు చేశారు. ఇలా నేరుగా మొత్తం నిల్వలను తరలించకుండా, బహుళ దశల్లో వ్యూహాత్మకంగా ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, ఆర్థిక ఉద్రిక్తతలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా-కెనడా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాలు, పరస్పరం విధించుకున్న భారీ సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అదే సమయంలో అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో అస్థిరతకు దారితీశాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి పెరుగుతున్న వేళ.. అక్కడ బంగారం నిల్వలను కొనసాగించడం కంటే వాటిని లండన్‌కు తరలించడం మరింత సురక్షితమైన చర్యగా నెదర్లాండ్స్ భావించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
