
DET:NOV 08:
రజనీకాంత్ అభిమానులకు శుభవార్త: IFFI 2025లో సన్మానం:
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఇది నిజంగా పెద్ద పండుగ లాంటి వార్త.భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన విశేష సేవలకు గాను,ప్రతిష్టాత్మకమైన 56వ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం IFFI – International Film Festival of India 2025 ముగింపు వేడుకల్లో రజనీకాంత్‌ను ఘనంగా సన్మానించనున్నారు.ఈ సన్మానం ఈ ఏడాది IFFI వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
50 ఏళ్ల సినీ ప్రస్థానానికి అరుదైన గౌరవం:
తలైవా రజనీకాంత్ తన నట జీవితంలో 50 ఏళ్ల ఘన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.ఈ సుదీర్ఘ,అద్భుతమైన ప్రయాణానికి గుర్తింపుగా ఈ అరుదైన గౌరవాన్ని ప్రకటించారు.బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన శివాజీ రావు గైక్వాడ్ అలియాస్ రజనీకాంత్… 1975లో లెజెండరీ దర్శకుడు కె.బాలచందర్ రూపొందించిన అపూర్వ రాగంగళ్ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు.అప్పటి నుండి తన స్టైల్,విలక్షణమైన పాత్రలతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
IFFI 2025 వేదిక,ఇతర విశేషాలు:
56వ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం 2025,నవంబర్ 20 నుంచి 28 వరకు గోవా వేదికగా జరగనుంది.ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో మొత్తం 81 దేశాల నుండి 240కి పైగా చలనచిత్రాలను ప్రదర్శించనున్నారు.రజనీకాంత్ సన్మానంతో పాటు, ఈ వేడుకల్లో దిగ్గజ కళాకారులు గురు దత్,రాజ్ ఖోస్లా,రిత్విక్ ఘటక్,పీ.భానుమతి,భూపేన్ హజారికా వంటి వారి శత జయంతి వేడుకలు కూడా జరగనున్నాయి.ఈ సందర్భంగా వారి అపురూప చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు.
