హారర్ సినిమా అంటే దెయ్యాలు, ఒక్కసారిగా వచ్చే జంప్ స్కేర్స్ మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. కథలో దాగి ఉన్న మిస్టరీ, వాతావరణం, సౌండ్ డిజైన్, మనకు తెలియని భయం.. ఇవన్నీ కలిసి కూడా ప్రేక్షకులను భయపెట్టొచ్చు. ఇప్పుడు ఇదే తరహాలో ఓ డిఫరెంట్ హారర్ థ్రిల్లర్‌గా ‘418 ది మూవీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ప్రశాంత్ నీల్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి కీర్తన్ నాడగౌడ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా 15 ఏళ్లుగా మూసి ఉన్న రూమ్ నంబర్ 418ను మళ్లీ ఎందుకు తెరిచారు? ఆ గదిలో అసలేం జరుగుతోంది? అక్కడికి వెళ్లిన వారికి ఎదురయ్యే వింత అనుభవాల వెనుక రహస్యం ఏంటి? అనే ప్రశ్నలు ట్రైలర్ చూస్తున్నంతసేపూ వెంటాడుతాయి.

సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, చైత్ర జె ఆచార్, ప్రీతి పగడాల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సాధారణ హారర్ మూవీకి భిన్నంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 15 ఏళ్లుగా మూసివేసి ఉన్న ఓ భవనాన్ని కొందరు యువత సందర్శించడంతో కథలో అసలు భయం మొదలవుతుంది. అక్కడ ఒక్కొక్కరికి ఎదురయ్యే అనూహ్య పరిణామాలు, ముఖ్యంగా 418వ గది చుట్టూ ఉన్న మిస్టరీ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ట్రైలర్‌లో పెద్దగా కథను బయటపెట్టకుండా దర్శకుడు సస్పెన్స్‌ను మెయింటైన్ చేశారు. దెయ్యాల కంటే మన భయాలు, ఊహలే ప్రమాదకరంగా మారవచ్చనే కాన్సెప్ట్ కనిపిస్తోంది. చీకటి వాతావరణం, వింత శబ్దాలు, భయపెట్టే విజువల్స్ హారర్ ఎలిమెంట్స్‌ను మరింత బలంగా చూపిస్తున్నాయి. ఇక చైత్ర జె ఆచార్ పోషించిన దేవిక పాత్ర కూడా ట్రైలర్‌లో ప్రత్యేకంగా కనిపిస్తోంది.

దర్శకుడిగా కీర్తన్ నాడగౌడకు ‘418’ తొలి సినిమా. మైత్రి మూవీ మేకర్స్ హారర్ జానర్‌లో చేస్తున్న ఈ ప్రయత్నంపై కూడా ఆసక్తి నెలకొంది. సినిమాలోని హారర్ కంటెంట్ కారణంగా సెన్సార్ నుంచి ‘A’ సర్టిఫికెట్ లభించినట్లు చిత్ర బృందం తెలిపింది.

మొత్తానికి ‘418’ ట్రైలర్ చూస్తుంటే మిస్టరీ, సైకలాజికల్ టెన్షన్, సూపర్‌నేచురల్ అంశాలను కలిపిన సీరియస్ హారర్ థ్రిల్లర్‌గా సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రూమ్ నంబర్ 418 వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అక్కడికి వెళ్లిన తర్వాత వివేక్‌కు ఎదురయ్యేవి నిజమా.. లేక అతని భ్రమలా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సెప్టెంబర్ 18 వరకు వేచి చూడాల్సిందే.