
D News: Aug 10: తెలంగాణ రవాణా శాఖ పరిధిలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (MVI) ప్రస్తుతం నిర్వహిస్తున్న మాన్యువల్ ఫిట్నెస్ పరీక్షల విధానానికి త్వరలో తెరపడనుంది. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా ఫిట్నెస్ సర్టిఫికెట్లు (FC) జారీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ల (ATS) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది.
ప్రజా రవాణా, సరకు రవాణాకు వినియోగించే భారీ, మధ్య తరహా వాహనాలు, లారీలు, బస్సులతో పాటు లైట్ మోటార్ వాహనాలు, కార్లు, జీపులకు కూడా ఇకపై ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లలోనే కంప్యూటరైజ్డ్ విధానంలో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. వాహనాల పరిస్థితిని శాస్త్రీయంగా అంచనా వేసిన అనంతరం అర్హత సాధించిన వాహనాలకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న పైపైన తనిఖీలు, దళారుల ప్రమేయం, అవినీతికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో 15 కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. రవాణా శాఖ కార్యాలయాల ప్రాంగణాల్లో వీటి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండు క్లస్టర్లుగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మొత్తం రూ.115 కోట్లకు పైగా వ్యయం చేయనున్నారు.
క్లస్టర్-1 పరిధిలో రూ.61.60 కోట్ల వ్యయంతో నిజామాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, కరీంనగర్, సంగారెడ్డి డీటీసీ కార్యాలయాల వద్ద ఏటీఎస్లను ఏర్పాటు చేయనున్నారు. దుండిగల్-1, దుండిగల్-2, మేడ్చల్ ఆర్టీవో కార్యాలయాల పరిధిలో కూడా ఈ కేంద్రాలను నిర్మించనున్నారు.
క్లస్టర్-2లో రూ.53.68 కోట్ల వ్యయంతో మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ డీటీసీ కార్యాలయాలతో పాటు ఇబ్రహీంపట్నం ఆర్టీవో కార్యాలయం, కొండాపూర్ డ్రైవింగ్ ట్రాక్, పటాన్చెరు యూనిట్ ఆఫీస్, నాగోల్ డ్రైవింగ్ ట్రాక్ ప్రాంతాల్లో ఏటీఎస్లను ఏర్పాటు చేయనున్నారు.
ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లలో మానవ ప్రమేయాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి ఆధునిక కెమెరాలు, సెన్సార్లు, అనుసంధానిత పీయూసీ (PUC) సాఫ్ట్వేర్ ఆధారంగా వాహనాల కండిషన్ను తనిఖీ చేయనున్నారు. హెడ్లైట్ అలైన్మెంట్, స్పీడోమీటర్ కచ్చితత్వం వంటి అంశాలను డిజిటల్ విధానంలో పరిశీలిస్తారు.
అదే విధంగా వాహనాల బ్రేక్ కండిషన్, సైడ్ స్లిప్, సస్పెన్షన్ సిస్టమ్ పనితీరును కూడా సాంకేతిక పరికరాల ద్వారా పరీక్షిస్తారు. వాహనాల ఉద్గారాలు, కాలుష్య స్థాయి, వాహన నిర్మాణ సమగ్రత వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేసి.. నిర్దేశిత ప్రమాణాలను అందుకున్న వాహనాలకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయనున్నారు.
ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే వాహనాల ఫిట్నెస్ పరీక్షల్లో పారదర్శకత పెరగడంతో పాటు రహదారి భద్రతకు మరింత ప్రాధాన్యం లభించనుంది. మానవ తప్పిదాలు, అవినీతి, దళారుల ప్రమేయాన్ని తగ్గించి వాహనాల అసలు పరిస్థితిని శాస్త్రీయంగా నిర్ధారించేందుకు ఏటీఎస్లు కీలకంగా మారనున్నాయి.
