
టాలీవుడ్ కింగ్, నవ మన్మథుడు, ఎవర్‌గ్రీన్ హీరో అక్కినేని నాగార్జున పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అక్కినేని అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ‘విక్రమ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన నాగ్.. తనదైన నటన, స్టైల్‌తో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు.
ప్రేమకథా చిత్రాలకు నాగార్జున ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో భక్తిరస చిత్రాల్లోనూ తనదైన ముద్ర వేశారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత భక్తి ప్రధానమైన పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించిన హీరోగా నాగార్జునకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో క్లాస్, మాస్, రొమాంటిక్, భక్తి.. ఇలా విభిన్న జానర్లలో నటించి తన సత్తా చాటుకున్నారు.
అమ్మాయిల కలల రాకుమారుడిగా క్లాస్ చిత్రాలతో అలరించిన నాగ్.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’తో మాస్ హీరోగా కూడా తన సత్తా నిరూపించుకున్నారు. ఆ తర్వాత ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిరిడీ సాయి’ వంటి భక్తి చిత్రాల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను ప్రత్యేకంగా మలుచుకున్నారు.
నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’ 1986 మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి స్పందన అందుకోవడంతో నాగ్‌కు సినీ పరిశ్రమలో మంచి ఆరంభం లభించింది. అనంతరం వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. ‘ఆఖరి పోరాటం’, ‘గీతాంజలి’, ‘శివ’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘హలో బ్రదర్’ వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో కీలక విజయాలుగా నిలిచాయి.
ఇక ప్రస్తుతం నాగార్జున 99 సినిమాలను పూర్తి చేసి తన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 100వ సినిమాకు సిద్ధమవుతున్నారు. రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘లాటరీ కింగ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన 100వ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటోంది. నాగ్‌ను మరోసారి సరికొత్త పాత్రలో చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ సినిమాతో కింగ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు.. ఈ ప్రతిష్ఠాత్మక 100వ సినిమాలో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ అక్కినేని గెస్ట్ రోల్స్‌లో కనిపించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తంగా నాగార్జున 100వ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
