
హర్యానాలో దుండగులు రెచ్చిపోయారు. ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు ఓ సీనియర్ న్యాయవాది ఇంట్లోకి చొరబడి భారీ మొత్తంలో నగదు, బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. మొత్తం దోపిడీ విలువ సుమారు రూ.3.15 కోట్లు ఉంటుందని సమాచారం. కురుక్షేత్రలో గురువారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు, సీనియర్ అడ్వొకేట్ బల్వంత్ సింగ్ వాలియా థానేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాధితుడి వివరాల ప్రకారం.. గురువారం రాత్రి పెంపుడు కుక్కను తీసుకుని బయటకు వెళ్లిన ఆయన రాత్రి 9.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటికే ఇంట్లో ఉన్న దుండగులు ఆయన భార్యను బంధించి మంచంపై పడేశారు. ఆమె మాట్లాడకుండా ఉండేందుకు నోటికి గమ్ టేప్ వేశారు. అనంతరం న్యాయవాదిని కూడా తుపాకీతో బెదిరించి తాళ్లతో కట్టేశారు.
డిజిటల్ లాకర్లను తెరవడం దుండగులకు సాధ్యం కాకపోవడంతో.. వాటిని ఓపెన్ చేయాలని లాయర్‌పై ఒత్తిడి తెచ్చారు. లాకర్లు తెరవకపోతే కాల్చి చంపేస్తామని బెదిరించడంతో భయపడిన న్యాయవాది వారు చెప్పినట్లే చేశారని పోలీసులు తెలిపారు.
నగదు, బంగారం, వెండితో పాటు రివాల్వర్ అపహరణ
లాకర్లు తెరిచిన తర్వాత దుండగులు సుమారు రూ.17-20 లక్షల నగదు, 1.5 నుంచి 2 కిలోల బంగారు ఆభరణాలు, 4 కిలోల వెండి వస్తువులు, విగ్రహాలు తీసుకెళ్లారు. అంతేకాకుండా లైసెన్స్ కలిగిన రివాల్వర్, క్యాట్రిడ్జ్‌లను కూడా అపహరించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసిన దుండగులు.. వాటికి సంబంధించిన డీవీఆర్‌లను కూడా తమ వెంట తీసుకెళ్లారు. అంతేకాకుండా మరో రూ.80 లక్షలు ఇవ్వాలని న్యాయవాదిని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇస్తే హత్య చేస్తామని హెచ్చరించి అక్కడి నుంచి పరారయ్యారు.
మార్చి నెలలో కూడా తమ ఇంట్లో చోరీ చేసి రూ.50 లక్షలు ఎత్తుకెళ్లినట్లు దుండగులు చెప్పారని బల్వంత్ సింగ్ వాలియా పోలీసులకు తెలిపారు. వారు వెళ్లిపోయిన తర్వాత ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేయడంతో వారు ఇంటికి చేరుకుని భార్యాభర్తలను బంధనాల నుంచి విడిపించారని చెప్పారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
