
నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు ఇటీవల సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ వివాదంపై తాజాగా హీరోయిన్ కీర్తి సురేశ్ స్పందించారు. రాధికా ఆప్టే మాట్లాడిన సమయంలో ఆమె ఉద్దేశం తనకు మొదట్లో సరిగ్గా అర్థం కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘సత్యవాన్ సావిత్రి’ ప్రమోషన్లలో పాల్గొంటున్న కీర్తి.. ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
రాధికా ఆప్టే వ్యాఖ్యలతో మొదలైన వివాదం
గతంలో ఓ తెలుగు సినిమాలో తనకంటే ఎక్కువ వయసున్న హీరోతో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని రాధికా ఆప్టే ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. అంతేకాకుండా, సినిమాలో కథ ప్రకారం తన మేనమామను వివాహం చేసుకునే పాత్రలో నటించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ సమయంలో రాధికా ఆప్టే పక్కనే ఉన్న కీర్తి సురేశ్ నవ్వుతూ కనిపించడం కూడా విమర్శలకు కారణమైంది.
దక్షిణాది సంప్రదాయాల గురించి మాట్లాడారని తర్వాత తెలిసింది
తాజాగా ఈ వివాదంపై స్పందించిన కీర్తి సురేశ్.. రాధికా ఆప్టే వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని మొదట అర్థం చేసుకోలేకపోయానని చెప్పారు. ఆ తర్వాత ఆమె దక్షిణాది సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారని తెలుసుకున్నట్లు వివరించారు. మన సంస్కృతిని తాను ఎప్పటికీ కించపరిచి మాట్లాడనని స్పష్టం చేశారు. ఉత్తరాది వారికి దక్షిణాది సంప్రదాయాల గురించి పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ వివరణతో రాధికా ఆప్టే వ్యాఖ్యల సమయంలో తాను నవ్వడంపై వస్తున్న విమర్శలకు కీర్తి సురేశ్ సమాధానం ఇచ్చినట్లయింది.
