
ప్రపంచంలోని ప్రముఖ గోల్ఫ్ లీగ్లలో ఒకటైన LIV Golf తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దాదాపు 500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు అప్పులు ఉన్నట్లు పేర్కొంటూ న్యూజెర్సీ కోర్టులో దివాలా రక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
లీగ్ నుంచి భారీ మొత్తంలో బకాయిలు పొందాల్సిన వారిలో పలువురు స్టార్ గోల్ఫ్ క్రీడాకారులు కూడా ఉన్నారు. ఒక్కో ఆటగాడికి సుమారు 2 మిలియన్ నుంచి 7 మిలియన్ డాలర్ల వరకు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇవి మూడో త్రైమాసికం గణాంకాల ఆధారంగా ఉన్న మొత్తాలని, పూర్తి కాంట్రాక్ట్ విలువ మరింత ఎక్కువగా ఉండొచ్చని సమాచారం.
సౌదీ నిధులు ఆగిపోవడంతో కష్టాలు
LIV Golfకు సౌదీ అరేబియాకు చెందిన Public Investment Fund (PIF) 2022 నుంచి ప్రధాన ఆర్థిక మద్దతుదారుగా ఉంది. అయితే 2026 సీజన్ ముగిసిన తర్వాత ఈ నిధుల ప్రవాహం నిలిచిపోవడంతో లీగ్ ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
దివాలా ప్రక్రియతో పాటు సంస్థ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను కూడా LIV Golf ప్రకటించింది. ఇందులో భాగంగా ఆటగాళ్లకు సంస్థలో మెజారిటీ వాటా కల్పించే ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు సమాచారం.
అయితే లీగ్ కార్యకలాపాలు కొనసాగేందుకు PIF సుమారు 50 మిలియన్ డాలర్ల మధ్యంతర నిధులు అందించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దివాలా ప్రక్రియ పూర్తైన తర్వాత కొత్త పెట్టుబడిదారులు రంగంలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ కేసుపై తొలి విచారణ వచ్చే వారంలో జరిగే అవకాశం ఉంది.
