ప్రముఖ ఓటీటీ వెబ్‌సిరీస్ ‘పంచాయత్’ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఐదో సీజన్ ఈ ఏడాది విడుదల కావడం లేదంటూ రెండు రోజుల క్రితం ప్రైమ్ వీడియో చేసిన ప్రకటనతో నిరాశ చెందిన ప్రేక్షకులకు తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ సీజన్ 5 స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 3 నుంచి ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.

బన్రాకస్ వర్సెస్ సచివ్జీ.. కొత్త పోస్టర్ ఆసక్తికరం

తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో బన్రాకస్ పాత్రలో నటించిన దుర్గేశ్ కుమార్.. సచివ్జీ పాత్రధారి జితేంద్ర కుమార్ వైపు వేలు చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. సచివ్జీ నేలపై పడిపోయి ఉండటం పోస్టర్‌లో ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్‌ను పంచుకుంటూ.. ఫులేరాలో గొడవలు, ప్రేమ రెండూ ఉంటాయని, ప్రేక్షకుల కోసం ఎదురుచూస్తున్నామని ప్రైమ్ వీడియో పేర్కొంది.

అభిషేక్‌కు కొత్త సవాళ్లు

ఐదో సీజన్ కథలో అభిషేక్ త్రిపాఠి (జితేంద్ర కుమార్) తన ఎంబీఏ కలను నెరవేర్చుకోవాలని భావిస్తాడు. అయితే ఫులేరాలో మారిన రాజకీయ పరిస్థితులు, కొత్త నాయకత్వం నుంచి ఎదురయ్యే సమస్యల కారణంగా అతడికి సవాళ్లు ఎదురుకానున్నాయి. ఊరిని విడిచి వెళ్లే ముందు అక్కడ పరిష్కరించాల్సిన కొన్ని విషయాలు కూడా అతడి ముందున్నట్లు కథా పరిచయంలో వెల్లడించారు.

ఫులేరాలో మారిన రాజకీయ సమీకరణాలు

నాలుగో సీజన్‌లో ఫులేరా గ్రామ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధాన్‌జీ, మంజు దేవి నాయకత్వానికి ముగింపు పలుకుతూ క్రాంతి దేవి కొత్త సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. దీంతో గ్రామంలో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బన్రాకస్ పాత్రకు ఐదో సీజన్‌లో మరింత ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది. కొత్త నాయకత్వంలో అభిషేక్ ప్రయాణం ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ప్రముఖ తారాగణంతో ఐదో సీజన్

దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా, ఫైసల్ మాలిక్, చందన్ రాయ్, సాన్వికా, దుర్గేశ్ కుమార్, అశోక్ పాఠక్, సునీతా రాజ్వర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీవీఎఫ్ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు ఇప్పటికే మంచి ప్రేక్షకాదరణ ఉంది. మరి ఈసారి ఫులేరాలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *