
టాలీవుడ్లో దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి కనిపించడం, సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోలు ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చాయి. తాజాగా తరుణ్ భాస్కర్ తల్లి, నటి గీతా భాస్కర్ చేసిన వ్యాఖ్యలతో వీరి బంధంపై మరోసారి చర్చ మొదలైంది.
కష్టకాలంలో ఈషా అండగా నిలిచింది
‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న గీతా భాస్కర్.. గత రెండేళ్లుగా తరుణ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడని తెలిపారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పలు సమస్యలు ఎదురైన సమయంలో ఈషా అతడికి అండగా నిలిచిందని చెప్పారు. తరుణ్‌కు ఈషా మంచి స్నేహితురాలు మాత్రమే కాదని, అతడికి ఎంతో ఆత్మీయమైన వ్యక్తి అని ఆమె పేర్కొన్నారు.
ఈషాకు కృతజ్ఞతలు తెలిపిన గీతా భాస్కర్
తన కుమారుడికి జీవితంలో ఒక తోడు ఉండటం తనకు ఎంతో ధైర్యాన్నిస్తోందని గీతా భాస్కర్ భావోద్వేగంగా మాట్లాడారు. తరుణ్‌కు ఈషా మంచి సోల్‌మేట్‌గా నిలిచిందని, అతడికి అండగా ఉన్నందుకు ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే తరుణ్, ఈషా మధ్య ఉన్న అనుబంధంపై పలు సందర్భాల్లో చర్చ జరిగినప్పటికీ.. తాజాగా గీతా భాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చాయి. అయితే వీరి పెళ్లిపై మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
