
DNews:14 OCT:హైదరాబాద్: “గురుకులాలకు గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు నీటి మూటలేనా?” అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్రంగా ప్రశ్నించారు. గురుకులాలకు తగిన నిధులు కేటాయించకపోవడాన్ని ఆయన ధ్వజమెత్తారు.
హరీశ్‌రావు తన ఎక్స్ (X) ఖాతాలో చేసిన పోస్టులో, “రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన లేదని గురుకులాలకు కేటాయించిన చాలీచాలని రూ.60 కోట్లే ఉదాహరణ” అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 1024 గురుకులాల్లో చదువుతున్న ఆరున్నర లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం కనీసం రూ.100 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉందని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
అలాగే ఆయన, “కమీషన్లు రావనే గురుకులాలకు నిధులు కేటాయించడం లేదా? మీరు కేటాయించిన నిధులతో సిబ్బంది వేతనాలు, మరమ్మతులు, అత్యవసర పనులు ఎలా సాధ్యం?” అని ప్రశ్నించారు. గురుకులాలకు సరఫరా చేసే కాంట్రాక్టర్ల బిల్లులు, మెస్, కాస్మొటిక్, స్టిచ్చింగ్ ఛార్జీలు, అద్దె బకాయిలు, తాత్కాలిక సిబ్బంది వేతనాలు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.
తాజాగా విద్యార్థులు గణితం ఉపాధ్యాయుల నియామకానికి డిమాండ్ చేస్తూ రోడ్డెక్కడం, “పురుగులన్నం మాకొద్దు” అంటూ నిరసనలు తెలపడం వంటి ఘటనలను ప్రస్తావిస్తూ, “విద్యార్థులను ఆందోళన బాట పట్టించినది కాంగ్రెస్ ప్రభుత్వం” అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, ప్రచారం చేసుకోవడంవల్ల సమస్యలు తీరవు. గురుకులాల బిల్లులు, వేతనాలు, అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలి. 22 నెలలుగా కొనసాగుతున్న సమస్యల పరిష్కారానికై తగిన నిధులు వెంటనే విడుదల చేయాలి” అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
