
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఫ్రాంచైజీ మారనున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు నాలుగు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు హార్దిక్‌తో పాటు ఏ ఫ్రాంచైజీ కూడా దీనిపై అధికారికంగా స్పందించలేదు. మరోవైపు ముంబయి ఇండియన్స్ మాత్రం హార్దిక్ ట్రేడింగ్‌పై తాము ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేసింది.
అయినప్పటికీ హార్దిక్ ట్రేడింగ్‌పై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హార్దిక్‌ను ఓ నిర్దిష్ట మొత్తానికి మరో ఫ్రాంచైజీకి ట్రేడ్ చేశారంటూ కూడా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఐపీఎల్, బీసీసీఐ, ఫ్రాంచైజీలకు కీలక సూచన చేశారు.
ప్లేయర్ ట్రేడింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బహిరంగంగా వెల్లడించాలని గావస్కర్ అభిప్రాయపడ్డారు. “ఒక ఫ్రాంచైజీ నుంచి మరో జట్టుకు ఆటగాళ్లు మారుతున్నారంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో చాలా ప్రచారం జరుగుతోంది. అయితే ట్రేడింగ్ ప్రక్రియకు సంబంధించిన గడువు ముగియడానికి ఇంకా సమయం ఉంది. ఒక ఆటగాడు మరో ఫ్రాంచైజీకి మారిన విషయం తెలిసినా.. అసలు డీల్ ఎంత మొత్తానికి జరిగిందనే పూర్తి సమాచారం కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. ఆటగాడితో పాటు బీసీసీఐ, రెండు ఫ్రాంచైజీలకు మాత్రమే అసలు వివరాలు తెలుస్తాయి” అని గావస్కర్ పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రాంచైజీలు నిర్దేశించిన వేతన పరిమితి మేరకే వ్యవహరించాయా? నిబంధనలను ఉల్లంఘించాయా? అనే విషయాలు బయటివారికి తెలియవని ఆయన అన్నారు. అందుకే ట్రేడింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని సూచించారు.
“ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 లీగ్. ఆర్థిక వ్యవహారాల విషయంలో కూడా లీగ్‌పై ఎవరూ అనుమానాలు వ్యక్తం చేసే అవకాశం లేకుండా చూడాలి. ప్రతి ట్రేడింగ్‌కు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడం మంచిది. దీనివల్ల ఐపీఎల్‌పై నమ్మకం మరింత పెరగడంతో పాటు లీగ్ ప్రతిష్ఠ కూడా మెరుగవుతుంది” అని గావస్కర్ అభిప్రాయపడ్డారు.
