
సూపర్‌స్టార్ రజనీకాంత్, సీనియర్ నటి శ్రీయ శరణ్ కలిసి ఉన్న ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీయ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రజనీకాంత్‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘హ్యాపీ డే’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
వీరిద్దరూ గతంలో ‘శివాజీ: ది బాస్’ సినిమాలో జంటగా నటించిన విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. రజనీకాంత్-శ్రీయ జోడీకి కూడా మంచి స్పందన వచ్చింది.
తాజాగా శ్రీయ షేర్ చేసిన ఫొటోతో ‘శివాజీ’ కాంబినేషన్ మరోసారి తెరపై కనిపించబోతోందా? అంటూ అభిమానుల్లో చర్చ మొదలైంది. రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న ‘ధర్మన్’ మూవీ మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో సూపర్‌స్టార్ కూడా పాల్గొంటున్నారు.
ఇదే సమయంలో శ్రీయ సెట్స్ నుంచి రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆసక్తిని పెంచింది. దీంతో ఆమె ‘ధర్మన్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారా? లేక రజనీకాంత్‌తో కలిసి ప్రత్యేక పాటలో సందడి చేయనున్నారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
శ్రీయ ఫొటోతో ‘ధర్మన్’పై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఆమె సినిమాలో నటిస్తున్నారా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. చిత్రబృందం నుంచి స్పష్టత వచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగనుంది.
అశ్విన్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్న ‘ధర్మన్’ చిత్రాన్ని ఉలగనయగన్ కమల్ హాసన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
