
‘కరుప్పు’తో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన సూర్య.. పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా ఓవర్సీస్లో ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఓవర్సీస్ ఆడియెన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం.
సినిమా ప్రారంభంలో దాదాపు 20 నిమిషాల వరకు కథనం కాస్త నెమ్మదిగా సాగుతుందని టాక్. అయితే అసలు కథలోకి ప్రవేశించిన తర్వాత సినిమా వేగం పుంజుకుని ఇంటర్వెల్ వరకు ఆసక్తికరంగా సాగుతుంది. కథను ముందుకు తీసుకెళ్లే క్రమంలో కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది.
ఫస్టాఫ్ మొత్తంగా కథాంశానికి ప్రాధాన్యత ఇస్తూ తెరకెక్కించడంతో మంచి ఫీల్ గుడ్ అనుభూతిని అందిస్తుంది. సెకండాఫ్ కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా నీట్‌గా సాగుతుందని, క్లైమాక్స్ సినిమాకు చక్కటి ముగింపునిచ్చిందని ప్రేక్షకుల టాక్. అయితే కొన్ని అనవసరమైన సబ్‌ప్లాట్స్, మెలోడ్రామా ఎక్కువగా ఉండటం వల్ల అక్కడక్కడ సినిమా సాగదీసినట్లు అనిపిస్తుందని చెబుతున్నారు. రన్‌టైమ్‌ను మరికాస్త తగ్గించి ఉంటే మరింత బాగుండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇక సూర్య తన వయసుకు, పాత్రకు తగ్గట్టుగా అద్భుతమైన నటన కనబరిచినట్లు ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓ కీలకమైన ఎమోషనల్ సీన్లో సూర్య నటనకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్, క్లాప్స్ లభించినట్లు తెలుస్తోంది. రాధిక, మమితా బైజు కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారని టాక్.
దర్శకుడు వెంకీ అట్లూరి రాసిన డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని తెలుస్తోంది. సంభాషణలు సహజంగా ఉండటంతో పాటు భావోద్వేగాలను చక్కగా పండించాయని ప్రేక్షకులు అంటున్నారు. సంగీతం మాత్రం ఓకే అనిపిస్తుందని, సెకండాఫ్‌లో ఇంకాస్త బలమైన సన్నివేశాలు ఉండి ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తంగా చూస్తే ఎలాంటి అసభ్యతకు తావులేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి చూడగలిగే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నిలుస్తుందని ఓవర్సీస్ టాక్ చెబుతోంది. ఈ వారాంతంలో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే సినిమాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఈ టాక్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
