
శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టుకు భారత జట్టు కూర్పులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. తొలి టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంపై సందేహాలు నెలకొన్నాయి. అతడి స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
గాలె టెస్టులో స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై కూడా కుల్దీప్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసుకున్న అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలంగా మారిన ఐదో రోజు ఆటలోనూ కుల్దీప్ తన సత్తా చాటలేకపోయాడు.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అతడిని మూడో స్పిన్ ఆప్షన్‌గా పరిగణిస్తున్నట్లు తొలి టెస్టులోనే స్పష్టమైన సంకేతాలు కనిపించాయి. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ కలిసి 46.4 ఓవర్లు బౌలింగ్ చేయగా.. కుల్దీప్‌కు గిల్ కేవలం 11 ఓవర్లు మాత్రమే ఇచ్చాడు. ఈ 11 ఓవర్లలో అతడు 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక మ్యాచ్ మొత్తంలో 14 ఓవర్లు బౌలింగ్ చేసి 65 పరుగులు ఇచ్చాడు.
ఈ గణాంకాల నేపథ్యంలో రెండో టెస్టు తుది జట్టులో కుల్దీప్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సారాంశ్ జైన్‌కు అవకాశం?
మరోవైపు 33 ఏళ్ల ఆఫ్‌స్పిన్నర్ సారాంశ్ జైన్ భారత టెస్టు అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో సారాంశ్‌కు మంచి అనుభవం ఉంది. ఇప్పటివరకు 54 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 188 వికెట్లు పడగొట్టడంతో పాటు 31.75 సగటుతో 2,223 పరుగులు చేశాడు.
2025 దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ తరఫున సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో అర్ధశతకాలు సాధించిన సారాంశ్.. రెండు మ్యాచ్‌ల్లో కలిపి 16 వికెట్లు తీసుకున్నాడు. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును కూడా అందుకున్నాడు.
గత రంజీ సీజన్‌లోనూ సారాంశ్ ఆకట్టుకున్నాడు. 30 వికెట్లు పడగొట్టడంతో పాటు 57.55 సగటుతో 518 పరుగులు చేశాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఉపయోగపడే సామర్థ్యం అతడికి అదనపు బలంగా మారింది.
మరి అనుభవజ్ఞుడైన కుల్దీప్‌ను పక్కన పెట్టి రెండో టెస్టులో సారాంశ్ జైన్‌కు అరంగేట్ర అవకాశం కల్పిస్తారా? లేక కుల్దీప్‌పైనే మరోసారి నమ్మకం ఉంచుతారా? అనేది తుది జట్టు ప్రకటించే వరకు ఆసక్తికరంగా మారింది.
