
కన్నడ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం **‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’ (Toxic Movie)**పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో సినిమా గురించి యశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ‘టాక్సిక్’ పిల్లల కోసం రూపొందించిన సినిమా కాదని, పూర్తిగా పెద్దలను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన చిత్రమని ఆయన స్పష్టం చేశారు.
యశ్ మాట్లాడుతూ.. “పిల్లలు ఈ సినిమాను చూడకపోవడమే మంచిది. ఇది పూర్తిగా పెద్దల కోసం రూపొందించిన చిత్రం. ఈ విషయాన్ని మరోసారి స్పష్టంగా చెబుతున్నాను. పెద్దలకు మంచి, చెడు మధ్య తేడా ఏంటో తెలుసు. సినిమాలోని అంశాల నుంచి ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదనేది వాళ్లే నిర్ణయించుకోగలరు.
జీవితంలో ఏది సరైనది.. ఏది తప్పు అనే విషయాన్ని అర్థం చేసుకునే విచక్షణ పెద్దలకు ఉంటుంది. అందుకే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ కథను ఎంతో నిజాయతీగా తెరకెక్కించాం” అని తెలిపారు.
యశ్ వ్యాఖ్యలతో ‘టాక్సిక్’లో ఎలాంటి కంటెంట్ ఉండబోతోందనే ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యశ్ పాత్ర ఎలా ఉండబోతోందనేది తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరి యశ్ చెప్పినట్లుగా ‘టాక్సిక్’ పూర్తిగా పెద్దల కోసం ఎలాంటి కథతో రూపొందిందో తెలియాలంటే ఆగస్టు 26 వరకు వేచి చూడాల్సిందే.
