
యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ రివెంజ్ డ్రామా ‘టాక్సిక్’ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా సెన్సార్‌కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి సీన్‌ను తొలగించాలని సూచించకుండా సినిమాకు క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందిన ‘టాక్సిక్’ రన్‌టైమ్ 3 గంటల 12 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తోంది.
కన్నడ వెర్షన్‌లో రెండు పదాలను మ్యూట్ చేయడంతో పాటు.. స్మోకింగ్, ఆల్కహాల్‌కు సంబంధించిన సన్నివేశాల వద్ద తప్పనిసరిగా హెచ్చరిక సందేశాలను ప్రదర్శించాలని సెన్సార్ బోర్డు సూచించినట్లు సమాచారం.
సోషల్ మీడియాలో చర్చ
సాధారణంగా హింసాత్మక సన్నివేశాలు, అభ్యంతరకర కంటెంట్ విషయంలో సెన్సార్ బోర్డు కఠినంగా వ్యవహరిస్తుందనే అభిప్రాయం ఉంది. అయితే భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ‘టాక్సిక్’కు ఒక్క సీన్‌ను కూడా కట్ చేయకుండా ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
కొన్ని సినిమాల్లో చిన్నపాటి సన్నివేశాలపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసే సెన్సార్ బోర్డు.. ‘టాక్సిక్’ విషయంలో మాత్రం ఎలాంటి కట్స్ సూచించకపోవడంపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పటికే యశ్ కూడా ‘టాక్సిక్’ పూర్తిగా పెద్దలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమా అని చెప్పిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుందని, ఎంతో నిజాయతీతో సినిమాను తెరకెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
