
దళపతి విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జన నాయగన్’ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. విజయ్ సినీ కెరీర్లో చివరి చిత్రంగా ప్రచారం పొందిన ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ, ఆయనకున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
థియేటర్లలో సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీలో చూసే అవకాశం రానుంది.
జీ5లో ‘జన నాయగన్’ స్ట్రీమింగ్
‘జన నాయగన్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఆగస్టు 21, 2026 నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. హిందీ వెర్షన్ మాత్రం మరికొంత ఆలస్యంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
విజయ్ సరసన పూజా హెగ్డే, మమితా బైజు నటించగా.. బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించారు. ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నరేన్, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది.
ఇదీ కథ
‘జన నాయగన్’లో విజయ్ వెట్రి అనే పాత్రలో కనిపిస్తారు. ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయే పోలీస్ అధికారి శ్రీకాంత్ తన కుమార్తె విజి బాధ్యతను వెట్రికి అప్పగిస్తాడు. ఆయన చివరి కోరిక మేరకు విజిని ఆర్మీలో చేర్పించాలనే లక్ష్యంతో వెట్రి ఆమెకు శిక్షణ ఇస్తాడు.
చిన్నతనంలో తల్లి హత్యను కళ్లారా చూడటంతో విజి మానసికంగా భయంతో ఉంటుంది. ఆ భయాన్ని అధిగమించేలా వెట్రి ఆమెకు ధైర్యం నేర్పిస్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తండ్రి–కూతుళ్ల అనుబంధం ఏర్పడుతుంది.
ఇదే సమయంలో అంతర్జాతీయ ఆయుధ వ్యాపారి జాన్ హిమ్లర్, అవినీతి రాజకీయ నాయకులతో కలిసి ‘ప్రాజెక్ట్ MM’ ద్వారా దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తాడు. ఈ కుట్రకు సంబంధించిన కీలక సమాచారం విజి చేతుల్లోకి రావడంతో ఆమె ప్రమాదంలో పడుతుంది.
విజిని కాపాడేందుకు వెట్రి రంగంలోకి దిగుతాడు. ఈ పోరాటంలో అతడు ఎదుర్కొనే సవాళ్లు ఏంటి? విజి తన భయాలను అధిగమించి ఎలా పోరాడింది? అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా వెట్రి ఎలా నిలబడ్డాడు? అనేదే ‘జన నాయగన్’లో ప్రధాన కథాంశం.
