ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం పేర్కొంది. థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం, విద్యుత్ ఛార్జీలు, లైసెన్స్‌ల విధానం, టికెట్ ధరలు, ఓటీటీ విడుదలలు వంటి పలు అంశాలు తమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఎగ్జిబిటర్లు తెలిపారు. విజయవాడలో జరిగిన ఫోరం సమావేశంలో థియేటర్లకు ఎదురవుతున్న సమస్యలపై చర్చించి.. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

2 వేల నుంచి 1200కు తగ్గిన థియేటర్లు

ఫోరం సమావేశంలో సీనియర్ ఎగ్జిబిటర్ యలమంచిలి రామచంద్రరావు మాట్లాడుతూ.. గతంలో రాష్ట్రంలో 2 వేలకుపైగా సినిమా థియేటర్లు ఉండేవని, ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 1200కు చేరిందని తెలిపారు. ముఖ్యంగా గత మూడు, నాలుగు నెలల్లోనే సుమారు 400 థియేటర్లు మూతపడినట్లు పేర్కొన్నారు.

థియేటర్ల నిర్వహణకు ఫైర్, సినిమాటోగ్రఫీ తదితర వివిధ శాఖల నుంచి లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుందని, వాటి గడువులు ఒక్కో విధంగా ఉండటంతో ఎగ్జిబిటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అన్ని అనుమతులకు ఒకే విధమైన గడువు ఉండేలా ఐదేళ్ల కాలపరిమితితో సింగిల్ విండో విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

థియేటర్లకు పారిశ్రామిక విద్యుత్ రాయితీ కోరుతూ..

టూరిజం, హోటల్ రంగాలకు అందిస్తున్న తరహాలోనే సినిమా థియేటర్లకు కూడా ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ వర్తింపజేయాలని ఎగ్జిబిటర్లు విజ్ఞప్తి చేశారు. సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లులు, థియేటర్ల నిర్వహణ, ఆధునీకరణకు అయ్యే ఖర్చులు గణనీయంగా పెరిగాయని తెలిపారు.

పెరుగుతున్న వ్యయాలను దృష్టిలో పెట్టుకుని థియేటర్ మెయింటెనెన్స్ ఛార్జీలను కొంత మేర పెంచుకునేందుకు అనుమతించాలని కోరారు. అలాగే పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఉన్న థియేటర్లకు వేర్వేరు విధానాల బదులు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా టికెట్ ధరల విధానాన్ని సమీక్షించాలని సూచించారు.

సినిమాల ఓటీటీ విడుదలపై 8 వారాల నిబంధన

థియేటర్లలో కొత్త సినిమా విడుదలైన తర్వాత కనీసం 8 వారాల పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయకుండా నిబంధన తీసుకురావాలని ఎగ్జిబిటర్లు కోరారు. థియేటర్లలో సినిమాలకు రన్ లభించాలంటే ఈ నిబంధన అవసరమని వారు అభిప్రాయపడ్డారు. నిర్మాతలు, ప్రభుత్వంతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

టికెట్ ధరలు పెంచితే ప్రేక్షకులు దూరమయ్యే అవకాశం

టికెట్ ధరలను పెంచడం వల్ల ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్నారని ఏపీ ఎగ్జిబిటర్స్ ఫోరం జాయింట్ సెక్రటరీ తెలిపారు. టికెట్ ధరలు పెంచకుండా విడుదలైన ‘ఇరుముడి’, సమంత సినిమా, ‘డీసీ’ వంటి చిత్రాలు మంచి ఆదాయాన్ని సాధించాయని ఉదాహరణగా పేర్కొన్నారు.

టికెట్ రేట్ల పెంపు వల్ల థియేటర్లకు పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని, అదనపు ఆదాయంలో ఎక్కువ భాగం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకే వెళ్తుందని వివరించారు. అందువల్ల టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవోలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.

పెరిగిన నిర్వహణ వ్యయాలపై ఆందోళన

ప్రస్తుతం థియేటర్ల నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. విద్యుత్ బిల్లులతో పాటు టాయిలెట్ల నిర్వహణ, సీటింగ్, శుభ్రత, ఇతర మరమ్మతులు, ఆధునీకరణకు అయ్యే వ్యయం కూడా పెరిగిందని తెలిపారు.

ఈ పరిస్థితుల్లో ప్రేక్షకులపై అదనపు భారం పడేలా టికెట్ ధరలను పెంచడం కంటే.. థియేటర్ నిర్వహణకు సంబంధించిన ఛార్జీలను మాత్రమే సవరించుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

థియేటర్లపై ఆధారపడిన వేలాది కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం విజ్ఞప్తి చేసింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana